Thursday, April 21, 2016

ఆరాధన // మా చౌదరి గారబ్బాయ్ కోసం




ఆరాధన
అవును ఆరాధన
నా మనసు నీ తలపులలో చిక్కుకున్నప్పుడు
అదేంటో తెలుసుకుందామని
ఆవేశంగా నీవైపు రాగానే
ప్రేమగా చూసే నీ కళ్ళను చూడగానే
చెప్పకనే తెలిసిపోయే మధురమైన మైమరపు
ఈ ఆరాధన ……….
.
ఆరాధన
అవును ఆరాధన
అలలు అలలుగా ఎగసిపడే
మనసులోని కోరికలు
నీ పాదాల్ని తాకగానే
సిగ్గుతో తలవంచుకుని
ఒక అడుగు వెనక్కి తగ్గి
పాదాభివందనం చేస్తూ
నీ చేతి స్పర్సకోసం ఆశగా చూస్తున్నప్పుడు
కలిగే వలపు
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
కౌగిలిలో కరిగిపోవాలని
కలలు కంటూ
వాకిటనే నా తలపులకు కావలి కాస్తూ
మాపటికి నువ్వు తెచ్చే మల్లెమొగ్గల కోసం
మౌనంగా మాట్లాడే భాషే
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
తొలిజాము కోడికూతకు
మరో ఘడియ మిగిలుందన్నప్పుడు
మనసు మౌనంగా
నిట్టూర్పుల వేడిని వదిలి
నీ నూనుగు మీసాలను
తాకుతూ పరవశించి పాడే పాటే
ఈ ఆరాధన
.

ఆరాధన
అవును ఆరాధన
నా అణువణువునా నిండిన
నిన్ను చూసి ,
నీ మనసే ఈర్ష్య పడేలా
నన్ను నేను రూపాంతరం చెందుతూ
నీకోసం ఇప్పటికి వాకిలిలో
ఎదురుచూస్తూ పడే ఆరాటమే
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
పొద్దున్నే పూసే మందారం దగ్గరనుండి
సాయంత్రం విరిసే విరజాజి వరకు
అడిగి తెలుసుకో
నీకోసం నీలాకాసం వైపు చూస్తూ
పొద్దుపోయే సమయం కోసం ఎంత వేచానో
ఆ ఎదురుచుపుల ఎరుపెక్కిన కళ్ళ ఆశే
ఈ ఆరాధన
.
ఆరాధన
అవును ఆరాధన
నీకోసం నా మనసు ఎన్నిసార్లు
కూనిరాగాలు తీస్తూ
కునికి పాట్లు పడుతూ
వాలిపోయేపొద్దుని విరహంతో లెక్క కడుతూ
నువ్వొచ్చే వరకు చుక్కలన్నిటిని
చిక్కని మాల గట్టి
ఆ గుప్పెడు మల్లియలని
తడుముతూ ఎదురుచూసే
మెత్తని తలపే
ఈ ఆరాధన
@Lakshmi

No comments:

Post a Comment