Thursday, March 3, 2016

Unpaid Prostitute


ప్రపంచానికి వేల మైళ్ళ దూరాన విరిసిన ముద్ద మందారం నేను
విసిరిపారేసారనుకోనా లేక విరిసే సమయం వరకు వద్దనుకున్నారనుకోనా
ఏదైతేనేం దూరంగానో భారంగానో , జీవితం ఇంతవరకు వచ్చింది
ఇక ఈ మందారం
" దేవుడి పాదాన్ని చేరుతుందా
లేక రాకుమారి సిగలో మెరుస్తుందా "
ఆశ బాగున్నా ఆలోచన ఇంకోటి కూడా అడుగుతుంది
"కొంపదీసి దేశాన్ని అమ్ముకునే నాయకుడి మెడలో పడుతుందా
ఏమో ఏది కాక పుట్టిన చోటనే గిట్టుతుందా .."
ఈ ఎర్ర మందారానికి
ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది
ఆ సమాజాన్ని చూడడానికి ....
ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంటే
వెలుగు రేఖలు మీద పడుతుంటే
నులి వెచ్చని వేకువలో తొలి పొద్దు రాకతో
ఎన్నో కోరికలను ఒక్కొక్క రేకులపై రాసుకుంటూ ..
చిన్న చిన్నగా కళ్ళు తెరిచా .........

నిన్న రాంత్రంతా ఈరోజు కోసం ఎదురు చూడడం తోనే గడిచిపోయింది ..
అయినా నాకళ్ళు అలసి పోలేదు
ఏదో కొత్త ఆశ
ఇక్కడనుండి చూస్తుంటే గుప్పెడంత కనిపిస్తున్న
ఆ అందమైన ప్రపంచం
దగ్గరగా ఎలా కనపడుతుందా అని
ఎన్ని రంగులో ఎన్ని చిత్రాలో , ఎన్ని విచిత్రాలో
అన్నీ ఈరోజు చూడాలి ..
కాని ఎలా ?
నన్ను ఎవరు తీసుకెళ్తారు?
ఇంత దూరం ఎవరు వచ్చి చూస్తారు ?
మనసు దిగులుగా వున్నా ...ఏదో ఆశ ...
.
.
సగం రోజు గడిచి పోయింది
నా కల కలలానే పోతుందా ? 
.
.
నా కోరికల రేకులు ఒక్కొక్కటి జీవం కోల్పోతున్నాయి
.
.
మధాహ్నం అయ్యింది
దూరాన ఎవరో కనపడుతున్నారు
కొంచెం ఆశ కలిగినా , ఎదురుచూపులకు ఓపిక లేదు
.
రానే వచ్చాడు అతను .
చెట్టంత తేరి పార చూసి
చేతికందిన పూలను కోసాడు
నేను చివరి కొమ్మన నిలబడి వున్నా
కనపడుతూనే వున్నా అందుకోలేక వెనుదిరిగాడు
.
నా ప్రాప్తం ఇంతే అనుకున్నా ..
ఏమైందో ఏమో వెనక్కి వచ్చి నన్ను తదేకంగా చూస్తున్నాడు
ఎలాగో నన్ను తీసుకెళ్ళాడు
ఇంకేందుకో ఆ చూపులు ..!
.
వెనక్కి రెండడుగులు వేసి మళ్లీ చూసాడు
నాకు కోపం వచ్చింది .
వెళ్ళే వాడు వెళ్ళకుండా అలా వింతగా చూస్తుంటే ..
.
ఎగా దిగా చూసి ఒక్క ఎగురుతో కొమ్మ అందుకున్నాడు .
పట్టరాని సంతోషం ....
వాడిపోయిన మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ..
నెమ్మదిగా తీసుకొని తెఛ్చిన బుట్టలో పెట్టి
నడక మొదలు పెట్టాడు.
బుట్ట లోనుండి పట్టణాన్ని చూస్తూ వున్నా ......
.
.
అడుగు అడుగుకి ఆనందం పెరిగిపోతుంది
వాడి నడకకి బుట్టలో నేను ఎగిరెగిరి పడుతున్నా
ఇన్నాళ్ళ కలలు  తీరబోతున్నాయి..
.
.
అంతా గందరగోళం .
అందరు అటూ ఇటూ పరిగెడుతూనే వున్నారు
ఎవరు  ఎవరికోసం ఆగడం లేదు..
.
బుట్ట తీసుకెళ్ళి ఒక కొట్టు ముందు పెట్టి
ఏదో మాట్లాడాడు
నన్ను తీసి బయట పెట్టి వెళ్ళిపోయాడు
.
.
గంట గడిచింది
ఇప్పటికి రెండుసార్లు నన్ను నీళ్ళతో తడిపాడు
ఎవరికోసమో ఎదురుచూస్తున్నాడు
నేను వచ్చే పోయే వాళ్ళను చూస్తున్నా
.
అందరు చూస్తున్నారు
కాని ఒక్కరూ మాట్లాడడం లేదు
ఒకడు వంకరగా చూస్తాడు
ఒకడు ఇష్టంగా చూస్తాడు
ఇంకొకడు ఎలా చూసాడో కూడా చెప్పలేకపోతున్నా
.
.
ఇంతలో ఒక ఎర్ర రంగు చీర కట్టుకున్న పెద్దావిడ వచ్చింది
నన్ను పట్టుకుని ఇటూ అటూ చూసింది
జడలో పెట్టుకుంటుందేమో అనుకున్నా
వాడితో ఏదో మాట్లాడి నన్ను కవర్లో పడేసింది
 సరే దేవుడికి పెడుతుందేమో చూద్దాం
ఏదయితేనేం ఒక గూటికి చేరుకోబోతోంది నా పయనం
.
.
అరగండ ఊపిరాడని ఆటో ప్రయాణం తర్వాత
ఒక పెద్ద ఇంటి ముందుకు చేరాం
నడుస్తూ ఆ ఇంటి పక్కవున్న చిన్న గల్లి లోకి వచ్చాం
చుట్టూ అందరూ ఆడవాళ్లే
అందంగా అలంకరించుకుని వున్నారు
కాని ఆ అందం మనసు వరకు రావడం లేదు
అయినా నాకెందుకులే వాళ్ళతో ...
.
.
ఏదో చిన్న పెంకుటిల్లు
ఇంత ఇరుకులో ఎలా వుండాలి
వెలుతురు కూడా సరిగా లేదు
గాలి కూడా ఏదో అత్తరు వాసనతో
ముక్కు పగిలిపోయేలా నిండి పోయింది  ..
.
.
తీసుకొచ్చి
చిన్న చాప మీద విసిరేసింది
నేల గట్టిగా తగలడంతో కొంచెం
బాధ అనిపించింది
ఇల్లంతా ఎంత వెతికినా
దేవుడి విగ్రహం గాని
ఫోటో కాని కనిపించలా ..
వెళ్లి అద్దం ముందు కూర్చొని
అలంకరించుకుంటుంది
ఓహ్ ఏదన్నా సుభకార్యానికి  వెల్తున్దేమోలె
చూస్తూ అలా కూర్చున్నా
.
.
ఆమె అలా ఓ అరగంటలో రెడీ అయ్యి
నా వైపు చూసింది
నేనూ ఆమెను చూసి నవ్వా
చేతిలో తీసుకుని
కొప్పులో ఒక పక్క పెట్టి చూసుకుంది
మొహంలో సంతృప్తి లేదు
తీసి నన్ను ఎగా దిగా చూసి
పట పటా నాలుగు రేఖలు విరిచేసింది
ప్రాణం విలవిల లాడింది
నొప్పి తట్టుకోవడం కష్టంగా వుంది
తీసి కొప్పులో పెట్టింది
ఎడమ చేత్తో నన్ను పట్టుకుని
టేబుల్ మీదనుండి కుడి చేత్తో ఏదో తీసి
గట్టిగా జుట్టుతో సహా నన్ను కదలకుండా
బంధించింది
ఇనుము అయ్యేసరికి
అది తగిలిన ప్రదేశమంతా గాయమయ్యింది
.
ఈ బాధ కంటే ఆ ఎడారిలో చెట్టుకు ఉండడమే
హాయి అనిపించింది
ఏం చేస్తా నా రాత ఇలా వుంది
.
.
ఎవరో తలుపుకొడుతున్నారు
వెళ్లి తీసింది
ఎవరో ఒకతను లోపలి వచ్చాడు
నోట్లో గుట్కా నములుతున్నాడు
సారా కంపు వొళ్ళంతా
ఇప్పటి వరకు ఉన్న అత్తరు కంపుకంటే
దారుణమయ్యింది  నా పరిస్తితి
పారిపోదామంటే ఆ ఇనుపచువ్వలొంచి
కదలలేకపోతున్నా
ఏం చెయ్యాలి ..
ఏడుపొస్తోంది
ఏం అర్ధం కావడం లేదు .
.
.
అయిదు నిముషాలు గడిచింది
ఆ తాగుబోతు ఎదవ ఇంకా పోలేదు
ఈవిడ ఇకిలిస్తూ మాట్లాడుతుంది
వాడు జేబులోంచి
ఓ అయిదొందల కాగితం తీసి
ఆమె చేతిలో పెట్టాడు
.
ఒక్కొక్క నిముషం ఎదురు చూసి
ఇలాంటి చోటుకి చేరతాననుకోలేదు
పట్నం .. పట్నం అని
ఇక్కడకొచ్చి ఇలా రాలిపోతాననుకోలేదు ..
.
.
రోజంతా ఎదురుచూసింది
ఇలాంటి ఆఖరి క్షణాలకోసమా ....!
.
కాదు కానే కాదు
కాని ఎలా తప్పించుకోవాలి
ఇలాంటి బ్రతుకు అక్కర్లేదు
తప్పించుకునే దారి లేదు ...
...
ఆలోచించా
ఒక్కటే మార్గం
అవును
ఆ ఒక్కటే మార్గం
.
.
నన్ను నేను నరుక్కోవడం 
ఒక్కొక్క రేకుని విరిచేసుకోడం మొదలు పెట్టా
అలా నాలుగైదు రేకులు విరిచే సరికి
అవి రాలి కింద పడ్డాయ్
అది చూసి ఆమె
పిన్నుఇంకా గట్టిగా పెట్టాలని
గట్టిగా కొప్పుని సర్దింది
.
.
ఆ పిన్ను నన్ను రెండుగా విరిచేసింది
.
.
నన్ను నేను చూసుకోడానికి మర్నాడు 
దేవుడి దగ్గర అనుమతి తీసుకుని వచ్చా..
నాకు తెలుసు
నేనేదో చెత్తకుండిలో పడి వుంటాను 

పుట్టుకకు ప్రాధాన్యం వున్నా
బ్రతుక్కు విలువలేకుండా పోయింది .
.
వెతుక్కుంటూ ఆ కొంప దగ్గరకొచ్చా ..
ఇష్టం లేకుండానే లోపలికొచ్చా
.
.
ఆవిడ నన్ను చేతిలో పెట్టుకుని
దిగులుగా కూర్చుంది 
ఎప్పటినుండో ఏడుస్తున్నట్టు వుంది
కళ్ళు ఎర్రగా మారి
కన్నీళ్లు కూడా ఎండిపోయాయి
.
ఆమెతో పరిచయం లేకపోయినా
ఎందుకో జాలి కలిగింది
అలానే చూస్తున్నా
.
ఒక గంట అయ్యాక నన్ను
తీసి అద్దం దగ్గర పెట్టి
అలమరా లోంచి మరొక చీర తీసి కట్టుకుంది
అద్దంలో తనని తను చూసుకొని
నవ్వు మొహానికి తగిలించుకుని
బయటకు వెళ్ళిపోయింది
.
.
అప్పుడు అర్ధమయ్యింది
వాళ్ళిచ్చే డబ్బులు
ఆమెను ఇప్పటికి కొనలేకపోయాయని..

@Lakshmi


.

No comments:

Post a Comment